ఇప్పుడు సోషల్ మీడియాలో హకూనా మటాటా హ్యాష్ ట్యాగ్ బాగా పాపులర్ అయింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో విపరీతంగా ట్రెండ్ అయింది. గంటకు వెయ్యి పోస్టులు ఈ హ్యాష్ ట్యాగ్‌తో వచ్చాయంటే ఇది ఎంతగా జనానికి ఎక్కిందో అర్థమవుతుంది. 25 ఏళ్ల కిందట అంటే 1994లో వచ్చిన ‘లయన్ కింగ్’ సినిమా ద్వారా మొదటి సారిగా ఆ మాట ప్రపంచానికి పరిచయం అయింది. ఈ సినిమా కథలో ముఫాసా అనే ఒక పేద్ద సింహం అడవికి రాజుగా ఉంటాడు. ముఫాసా తమ్ముడు స్కార్.. స్వార్థంతో అన్నను చంపేస్తాడు. ముఫాసా కొడుకు సింబాను కూడా చంపేయాలని ప్రయత్నిస్తాడు. కానీ సింబా తప్పించుకుని పారిపోతుంటాడు. ఈ క్రమంలో సింబాకు అడవి పంది అయిన పుంబా ఎదురుపడుతుంది. అది సింబాను చేరదీసి హకూనా మటాటా అని గట్టిగా అరుస్తాడు. అదే మాటతో ఓ పాట పాడతాడు. ఈ పాట భారీ హిట్ కొట్టింది. ఎంత పెద్ద హిట్ అయిందంటే.. హకూనా మటాటా ఒక బ్రాండ్‌గా మారిపోయింది. లయన్ కింగ్ సినిమా తీసిన వాల్డ్ డిస్నీ.. ఈ పేరు మీద రకరకాల వస్తువుల్ని విక్రయిస్తోంది. పాతికేళ్ల తరువాత మళ్లీ అదే పేరుతో లయన్ కింగ్‌ను తీశారు. ఒరిజినల్ సింహాలను, ఇతర జంతువులను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. జంగిల్ బుక్ మూవీ లాగే లయన్ కింగ్.. పిల్లల్ని విశేషంగా ఆకట్టుకుంది.
హకూనా మటాటా అనేది స్వాహిలీ భాషలోని పదబంధం. టాంజానియా, కెన్యా, రువాండా సహా పలు తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఈ భాషను మాట్లాడతారు. హకూనా అంటే ఏమీ లేదు అని, మటాటా అంటే సమస్యలు, చిక్కుమళ్లు అని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే నో ప్రాబ్లమ్. నో వర్రీస్. డిస్నీ కంపెనీ హకూనా మటాటాను ఒక ట్రేడ్ మార్కుగా చేసుకుంది. దీని మీద తూర్పు ఆఫ్రికా దేశాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది మా మాట. మాకు సంబంధించిన దానిని అమెరికాకు చెందిన కంపెనీ ఎలా సొంతం చేసుకుంటుంది? ఆ పదబంధం మీద ఎలా బిజినెస్ చేస్తుంది? అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ల వాదన ఎలా ఉన్నా డిస్నీ కారణంగానే హకూనా మటాటా మన దాకా వచ్చింది.
ప్రతి మనిషికి, ప్రతి కంపెనీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. కొందరు సంతోషంగా బతకడమే ధ్యేయంగా ఉంటారు. మరికొందరు తరతరాలుగా సరిపడా సంపదను కూడబెట్టుకోవాలని ఆరాటపడతారు. ఇంకా కొంత మంది పరులకు సహాయపడటంలో ఆనందం పొందుతారు. కంపెనీలు కూడా ఇలాగే వైవిధ్యమైన ఫిలాసఫీని కలిగి ఉంటాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను, కస్టమర్లను బాగా చూసుకోవాలని అనుకుంటాయి. కొన్ని కంపెనీలు లాభాల మీద మాత్రమే దృష్టి పెట్టాలని అనుకుంటాయి. ఇంకా కొన్ని కంపెనీలు సమాజంలో విప్లవాత్మక మార్పులు తేవాలనే దృక్పథంతో పరిశోధన చేస్తుంటాయి. లయన్ కింగ్ సినిమాలో పుంబా ఫిలాసపీ.. హ్యాపీగా ఉండటం. తాను నడిచే దారిలోనే సింబాను కూడా తీసుకెళతాడు. హకూనా మటాటా అంటూ తమ పరిధిలో ఉన్న అడవిని ఆస్వాదిస్తారు. ఆ తరువాత సింబాకు తన చిన్న నాటి స్నేహితురాలు ఎదురుపడటంతో కథ మరో మలుపు తిరుగుతుంది.
పలకడానికి సులభంగా ఉండే పదాలను సినిమాల ద్వారా ప్రయోగిస్తే జనంలోకి బాగా వెళతాయి. మంచి హిట్ అందుకున్న తెలుగు సినిమాల్లోని పాపులర్ డైలాగులను జనం విరివిగా వాడుతుంటారు. ఈ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అందరి కంటే నాలుగు అడుగులు ముందుంటారు. ఆయన డైలాగులు రాసిన, దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఎన్నో మాటలు జనం నోళ్ల మీద నానుతుంటాయి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు లాంటి త్రివిక్రమ్ సంభాషణలు తెలుగు వారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
——————————————————————————————————————————-
Disclaimer : The opinions expressed here belong solely to the author(s) and are not to be taken as the stated position(s) of Magnon or its subsidiaries.
September 24, 2019 — magnon