వేమన పద్యాలు – పరిచయం & విశ్లేషణ

వేమన పద్యాల గొప్పదనంతో పాటు వాటి వెనుక ఉన్న సైద్ధాంతిక ధోరణులను, నేటి ప్రపంచంలో అవి ఎంతవరకు సందర్భోచితమో పరిశీలిద్దాం రండి!

ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేమన అంటే తెలియనివారు ఉండరు. వేమన పద్యాలను పాఠాలుగా పిల్లలకు నేర్పడం నుండి వేమన పద్యాలలోని మాధుర్యాన్ని ఇప్పటికీ రోజువారీ సంభాషణల్లో గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.

వేమన పద్యాలు ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే ఆయన పద్యాల లోని పంక్తులు తెలుగులో సామెతలుగా స్థిర పడ్డాయి.

ఉదాహరణకు కొన్ని

‘తాటి చెట్టు కింద పాలు తాగడం’

దీని అర్థం : తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా అవి పాలని ఎవ్వరూ నమ్మరు. అలానే చెడ్డవారితో సావాసం చేస్తే

మనల్ని కూడా చెడ్డ వాడిగానే చూస్తోంది సమాజం.

‘తప్పులెన్నువారు తనతప్పులెరుగరు’

దీని అర్థం : తోటి వారిలో ఎన్నో తప్పొప్పులను విశ్లేషించే వారు తమలోని అంతరాత్మను ఎప్పటికీ ప్రశ్నించరనీ, వేరే ఎవరైనా వారిలో తప్పులను ఎత్తి చూపిస్తే అసలు ఒప్పుకోరనే మానవ నైజాన్ని చేదు నిజాన్నీ తేట తెలుగు పదాలలో చెప్పాడు వేమన.

‘వాన రాకడయును బ్రాణాంబు పోకడ’

దీని అర్థం : వ్యవసాయం వాన నీటి మీద మాత్రమే ఆధారపడే రోజుల్లో రైతులు నీటి కోసం ఆకాశం వైపు చూసి వాన రాకకోసం ఆశగా చూసేవారు. కానీ ఊహించినట్టుగా వానలు రాని రోజుల్లో వాన రాకడ ప్రాణం పోకడ రెండూ మన చేతుల్లో ఉండవు అని నిట్టూర్పులు విడిచేవారు.

యోగి వేమన స్మృతిగా భారత తపాలా శాఖ విడుదల చేసిన 20 పైసల స్టాంపు

ఇలా నైతిక అంశాలపై తనదైన దృక్కోణంతో పద్యాలు వ్రాసిన వేమన సాంఘిక విమర్శకుడిగా కూడా ప్రసిద్ధి పొందాడు. 17వ శతాబ్దంలో తన చుట్టూ ఉన్న సమాజంలోని అనైతికతను కూడా తూర్పారబెట్టాడు. ఇటువంటి విమర్శలలో తన కాలానికి చాలా ముందుగా ఉండేవాడు.

ఉదా:

రాచరికం
చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద
గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో
విశ్వదాభిరామ! వినురవేమ!

అంటూ రాచరిక వ్యవస్థలో ఇమిడి ఉన్న అన్యాయాన్ని వెల్లబుచ్చాడు.

మతం & ఆధ్యాత్మికత
వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులైన తలుపులు బోడులా
విశ్వదాభిరామ! వినుర వేమ!

అంటూ కట్టా బొట్టూ మారిస్తే సరిపోదనీ, అసలైన మార్పు మనుషుల మనసుల నుండీ రావాలనీ బాహ్య ఆచార వ్యవహారాలకు అధిక ప్రాధాన్యమిచ్చే ఛాందసులతో విభేదించాడు. తన విమర్శను పదును పెట్టి హిందూ మతానికి మూలాధారమైన విగ్రహారాధననూ వదిలి పెట్టలేదు.
పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి
చెలగి శిలల సేవ జేయనేల?
శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?
విశ్వదాభిరామ! వినురవేమ!

ఒక చేత్తో విగ్రహారాధనలోని ఆడంబరాన్నీ, విగ్రహారాధన పేరుతో జరిగే ఆహార వ్యర్థాన్నీ విమర్శిస్తూ తోటి మనిషికి సాయం చేయడమే మానవత్వమని పిలుపునిచ్చాడు.

కులం
మాలవానినంటి మరినీట మునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?
విశ్వదాభిరామ! వినురవేమ!

అంటూ అంటరానితనం లోని డొల్లతనాన్ని వ్యక్తపరిచాడు. కానీ ఇక్కడ ఒక్క మాట మాత్రం చెప్పాలి. వేమన విమర్శలు అంటరానితనం వరకే వెళ్లగలిగాయి కానీ కుల వ్యవస్థను తాకలేదు.

కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు
కాశీ కరుగఁ బంది గజము కాదు
వేరుజాతి వాడు విప్రుండు కాలేడు
విశ్వదాభిరామ! వినురవేమ!

కాబట్టి కుల వ్యవస్థను విమర్శించడంలో దళిత రచయితల కలానికి ఉన్న ఆవేదన, పదును, సొంతంగా అంటరానితనాన్ని ఎదుర్కొనని వేమన కలంలో లేదనే, ఉండదనే చెప్పాలి. కుల వ్యవస్థపై ఖచ్చితమైన విశ్లేషణ కోసం అంబేద్కర్ లాంటి మేధావులను మనం ఆచరించవలసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *