భూమ్మీద ప్రతి ప్రాణి.. తిండి, నిద్ర, పునరుత్పత్తి, స్వీయరక్షణ గురించి ఆలోచిస్తుంది. అంతకు మించి ఆలోచించగలిగిన శక్తి ఒక్క మనిషి మెదడుకు మాత్రమే ఉంది. మనిషితో పోలిస్తే ఏనుగు చాలా పెద్దది. కానీ దాని మెదడు కూడా ఒక పరిమితి దాటి ఆలోచించదు. పరిణామ క్రమంలో 70 వేల సంవత్సరాల కిందటి మనిషి మెదడు పరిమితులను చేధించుకుంది. దీన్నే జ్ఞాన విప్లవం (కాగ్నిటివ్ రివల్యూషన్) అని అంటారు. కొత్తగా వచ్చిన ఆలోచన శక్తి వల్ల మనిషి ఒక చోట స్థిరపడటం.. కొత్త కొత్త విషయాలను కనుగొనడం మొదలుపెట్టాడు. వాటిని తోటి మనుషులతో పంచుకోవాల్సి రావడంతో సమాచార మార్పిడి అవసరం ఏర్పడింది. ఈ మార్పిడి మొదట సంకేతాల రూపం తీసుకుంది. ఇది సంకేత భాష అయింది. ఆ తరువాత ఇది పదాల రూపం తీసుకుంది. దీన్ని భాషగా పిలవడం ప్రారంభమైంది. మొదట్లో ఏ భాషకు లిపి లేదు. భాష ఒక స్థాయికి వచ్చాక దానికి భాషా శాస్త్రవేత్తలు లిపిని రూపొందించారు.
ప్రపంచంలో మొదటి భాష ఏది అనే దానికి నిర్దిష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే 70 వేల సంవత్సరాల కిందట ఆలోచన శక్తి సాధించిన మనిషి ఎన్నో భాషల్ని రూపొందించుకున్నాడు. చాలా భాషలు పురిట్లో కనుమరుగయ్యాయి. ఇందువల్ల ఫలానా భాష మొట్టమొదటిది అని చెప్పడం అసాధ్యమైన విషయం. కాకపోతే ప్రస్తుతమున్న భాషలలో దేనికి ఎక్కువ చరిత్ర ఉంది అన్నది మాత్రం చెప్పగలం.
భారతీయ భాషలు
ప్రస్తుతం భూమ్మీద 770 కోట్ల మందికి పైగా జనాభా ఉంది. వీరందరూ 5 వేలకు పైగా భాషలు మాట్లాడుతున్నారు. మన దేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉండగా భాషలు 1650కి పైగా ఉన్నాయి. వీటిలో పదుల సంఖ్యలో భాషలు సంవత్సరాల్లో గడిచే కొద్దీ అంతరించిపోతూ వస్తున్నాయి. బహుశా ఇక్కడ నుంచి 100 సంవత్సరాలు గడిచే సరికి మన దేశంలో వాడుకలో ఉన్న భాషల సంఖ్య వెయ్యి లోపునకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ 22 భాషల్ని అధికారికంగా గుర్తించింది. అవి 1. అస్సామీ, 2. బెంగాలీ, 3. బోడో, 4. డోగ్రీ, 5. గుజరాతీ, 6. హిందీ, 7. కన్నడ, 8. కాశ్మీరీ, 9. కొంకణి, 10. మైథిలీ, 11. మలయాళం, 12. మణిపురి, 13. మరాఠీ, 14. నేపాలీ, 15. ఒరియా, 16. పంజాబీ, 17. సంస్కృతం, 18. సంతాలీ, 19. సింధీ, 20. తమిళం, 21. తెలుగు, 22. ఉర్దూ
భారతీయ భాషల్ని 4 కేటగిరీలుగా వర్గీకరించారు. అవి 1. ఇండో-ఆర్యన్ భాషా కుటుంబం ; 2. ద్రావిడ భాషా కుటుంబం ; 3. ఆస్ట్రో-ఏషియాటిక్ భాషా కుటుంబం ; 4. టిబెటో-బర్మన్ భాషా కటుంబం. ఈ నాలుగు కుటుంబాల గురించి తెలుసుకుంటే భారతీయ భాషల గురించి అర్థమవుతుంది.
ఇండో-ఆర్యన్ భాషా కుటుంబం
ప్రపంచంలో అతిపెద్ద భాషా కుటుంబం ఇండో-యూరోపియన్ కుటుంబం. ఇందులో ఇండో-ఆర్యన్ కుటుంబం ఉంది. దీన్నే హిందార్వ్య భాషా కుటుంబం అని కూడా అంటారు. ఇందులో మొదటి భాష వైదిక సంస్కృతం. రుగ్వేదం ఇందులో తొలి సాహిత్యం. ఇది ప్రపంచంలోనే మొదటి సాహిత్యమనే వాదన ఉంది. ఈ వాదనను వ్యతిరేకించే వారు కూడా చాలా మంది ఉన్నారు.
వైదిక సంస్కృతం ప్రధాన వైదిక కార్యక్రమాలకు నిర్దేశించింది. దీని కాల పరిధి క్రీ.పూ.1500 నుంచి క్రీ.పూ.1000. ఆ తరువాత వైదిక సంస్కృతం నుంచి లౌకిక సంస్కృతం వచ్చింది. ఇది కావ్య భాష. దీని కాలం క్రీ.పూ.1000 నుంచి క్రీ.పూ.600. లౌకిక సంస్కృతం నుంచి పాళీ ప్రాకృత అపభ్రంశ భాషలు వచ్చాయి. వీటి కాలం క్రీ.పూ.600 నుంచి క్రీ.శ.1000.
పాళీ భాష:క‌్రీ.పూ.563 నుంచి క్రీ.పూ.483 మధ్య కాలం. గౌతమబుద్ధుని బోధనలు ఈ భాషలోనే ఉన్నాయి.
ప్రాకృతం: లౌకిక సంస్కృతం నుంచి వర్ణ లోప, వర్ణ వికారాదులతో ఏర్పడింది. దీని కాలం: క్రీ.పూ.600 నుంచి క్రీ.శ.1000. బౌద్ధ, జైన గ్రంథాలు, శాసనాలు, నాటకాల్లో కనిపిస్తుంది.
అపభ్రంశ భాషలు: ప‌్రాకృతం నుంచి పుట్టినవి. గ్రంథస్థ ప్రాకృతాల కంటే భిన్నంగా ఉన్నందున అపభ్రంశ భాషలు అని అన్నారు.
నవీనౌత్తరాహ భాషలు:అపభ్రంశ భాషల నుంచి పుట్టినవి. వీటిలో ప్రధానమైనవి. 1. హిందీ, 2. ఉర్దూ, 3. బెంగాలీ, 4. పంజాబీ, 5. అస్సామీ, 6. గుజరాతీ, 7. ఒరియా, 8. మరాఠీ, 9. కాశ్మీరి, 10. కొంకణి, 11. నేపాలి, 12. సింధీ, ఇతర భాషలు.
1.హిందీ: క్రీ.శ. 1000 ప్రాంతంలో పుట్టిన ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్‌లలో మాట్లాడతారు. 65 కోట్ల మంది ఈ భాషను మాట్లాడుతున్నారు. హిందీలో మాండలికాల్ని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. పడమటి విభాగంలోకి రాజస్థానీ, వ్రజ, బుందేరీ, మాలవి, భోజ్‌పురి, మేవారి తదితర మాండలికాలు వస్తాయి. తూర్పు విభాగంలోకి అవధి, మైథిలీ తదితర మాండలికాలు వస్తాయి. ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి ఈ భాష మాత్రమే జాతీయ భాష అని చాలా మంది అనుకుంటారు. నిజానికి రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు జాతీయ భాషలు. తక్కువ మంది మాట్లాడతారు కాబట్టి సంబంధిత భాషల్ని చిన్న చూపు చూడటం, హేళనగా మాట్లాడటం సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతుంది.
2.ఉర్దూ: ఈ భాషను మాట్లాడే వారు దేశమంతా ఉన్నారు. 11 కోట్ల మందికి పైగా మాట్లాడతారు. సైనిక శిబిరాలు, దుకణాలు, బజార్లలో పుట్టిన భాష ఇది. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణాది మీద దండయాత్ర చేసిన సమయంలో ఈ భాష పుట్టింది. దీన్నే దఖినీ భాష అని కూడా అంటారు.
3.బెంగాలీ: పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల్లో 30 కోట్ల మంది మాట్లాడతారు. పుట్టుక క్రీ.శ.1000
4.పంజాబీ: 10 కోట్ల మంది మాట్లాడతారు. పుట్టుక క్రీ.శ.1000
5.గుజరాతీ: సుమారు 6.5 కోట్ల మంది మాట్లాడతారు. పుట్టుక క్రీ.శ.1100
6.అస్సామీ: సుమారు 2.5 కోట్ల మంది మాట్లాడతారు. పుట్టుక క్రీ.శ.1200
7.ఒరియా: సుమారు 4 కోట్ల మంది మాట్లాడతారు. పుట్టుక క్రీ.శ.1200
8.మరాఠీ: సుమారు 8 కోట్ల మంది మాట్లాడతారు. పుట్టుక క్రీ.శ.1100
9.కాశ్మీరీ: సుమారు 50 లక్షల మంది మాట్లాడతారు. పుట్టుక క్రీ.శ.900
10.కొంకణి: సుమారు 50 లక్షల మంది మాట్లాడతారు. ప్రధానంగా గోవాలో తక్కువ సంఖ్యలో మంగళూరు, ముంబాయి, కేరళ రాష్ట్రాల్లో మాట్లాడతారు. ఈ భాష మాట్లాడే వారు ఎక్కువ మంది క్రైస్తవులు.
11.నేపాలీ: సుమారు 1.7 కోట్ల మంది మాట్లాడతారు.
12.సింధీ: సుమారు 2 కోట్ల మంది మాట్లాడతారు. ఈ భాష మాట్లాడే వారు దేశమంతా ఉంటాయి.
ద్రావిడ భాషా కుటుంబం
ఇండో-ఆర్యన్ భాషా కుటుంబం తరువాత ద్రావిడ భాషా కుటుంబం పెద్దది. ఇందులో 23 భాషల్ని ఇప్పటికి గుర్తించారు. ప్రధానమైవి 1.తమిళం, 2.తెలుగు, 3.కన్నడం, 4.మలయాళం.
1.తమిళం: ప‌్రపంచంలోనే పురాతమైన భాషల్లో ముందు వరుసలో ఉంది. ఇండియా, శ్రీలంక, సింగపూర్, మలేషియా దేశాల్లో మాట్లాడతారు. సుమారు 8 కోట్ల మంది మాట్లాడతారు. క్రీ.పూ. నుంచే సాహిత్యం ఉంది.
2.తెలుగు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో సుమారు 8.5 కోట్ల మంది మాట్లాడతారు. 2 వేల ఏళ్ల కిందట పుట్టింది.
3.కన్నడం: సుమారు 4.5 కోట్ల మంది మాట్లాడతారు. తెలుగుతో సమానంగా చరిత్ర కలిగి ఉంది.
4.మలయాళం: కేరళలో దాదాపు 4 కోట్ల మంది మాట్లాడతారు. 1000 ఏళ్ల కిందట తమిళం నుంచి పుట్టింది.
తమిళం, మలయాళం లిపిల్లో, తెలుగు, కన్నడం లిపిల్లో పోలిక ఉంటుంది.
ఆస్ట్రో-ఏషియాటిక్ భాషా కుటుంబం
ఇక ఆస్ట్రో-ఏషియాటిక్ భాషా కుటుంబంలోకి సంతాలీ, ముండారీ, హూ, సవర, కోర్కు, జ్వాంగ్, కాశీ, నికోబరిస్ భాషలు ప్రధానమైనవి.
టిబెటో-బర్మన్ భాషా కటుంబం
టిబెటో-బర్మన్ కుటుంబంలో బోడో, మణిపురి, లుష్టా, గారో, భూతిమ, నెవారీ, లెప్చా, అస్మక, మికిర్ భాషలు ప్రధానమైనవి.
కొసమెరుపు :దేశంలో అత్యంత ఎక్కువగా మాట్లాడే ఇండో-ఆర్యన్ కుటుంబ భాషలకు మూలం సంస్కృతం. కానీ, జనబాహుళ్యంతో సంబంధం లేకపోవడం వల్ల కాలక్రమంలో ఈ భాషను మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయి, ప్రస్తుతం 15 వేలకు పడిపోయి, దాదాపుగా అంతరించి పోయిందని అంచనా. కేవలం పూజలు, మంత్రాల్లోనే మిగిలి ఉంది.
November 29, 2018 — magnon