మనం ఒక లోకలైజేషన్ ఏజెన్సీగా కంటెంట్‌ను దాదాపు మూలానికి చాలా దగ్గరగా అనువాదం చేస్తాం. అందువల్ల దీనిని నాన్-ఫిక్షన్ కేటగిరీ అంటారు. స్థానిక భాష, సంస్కృతులకు అనుగుణంగా అనువాదం చేయడంలో తరచుగా మనకు సవాళ్లు ఎదురవుతుంటాయి. ఏదైనా పద్యాన్ని ఒక భాష నుంచి మరో భాషకు అనువదించడం ఇందుకు ఒక ఉదాహరణ. ఏదైనా ఒక పద్యాన్ని అన్ని భారతీయ భాషల్లోకి అదే స్ఫూర్తితో, గాఢతతో లోకలైజ్ చేయడం ఎలా? మాగ్నాన్‌లో ఇందుకు ఓ పద్ధతి ఉంది.
ఒక పద్యాన్ని లోకలైజ్ చేయడం అనేది.. ట్రాన్స్‌క్రియేషన్‌కు (అనువాద సృష్టికి) చక్కటి ఉదాహరణ. ట్రాన్స్‌క్రియేషన్ అనేది ఒక ప్రాసెస్. లక్ష్యం, శైలి, స్వరం, సందర్భం దెబ్బతినకుండా కంటెంట్‌ను ఒక భాష నుంచి మరో భాషలోకి ఈ ప్రాసెస్ తీసుకువస్తుంది. ఈ పనిని సమర్థంగా చేయడానికి భాషావేత్త తన అనువాద దృక్పథం నుంచి ముందుకెళ్లి ఆలోచించాలి. తన సృజనాత్మక బుర్రకు పదును పెట్టాలి. ట్రాన్స్‌క్రియేషన్ చేస్తున్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.
-
- మూలంలో చెప్పదల్చుకున్న ఉద్దేశం ఏంటి? విషయం దూకుడుగా ఉందా లేక మృదువుగా ఉందా? చెప్పేది నేరుగా ఉందా లేక గూడార్థం ఉందా? పాటను జానపదం నుంచి తీసుకున్నారా లేక భక్తి గీతాల నుంచి తీసుకున్నారా?
- ఏ తరహా పాఠకులు లక్ష్యం? పెద్దగా చదువుకోని వారా లేక మంచి చదువులు చదువుకున్న పట్టణ యువతా? మూల భాషలో చెప్పింది అనువాదం చేరవేస్తోందా? చేరవేయకపోతే అనువాదాన్ని సరళతరం చేయాలా?
- మూలంలోని ఏ అంశాలు నిర్దేశిత పాఠకుల సంస్కృతికి దగ్గరగా ఉన్నాయి? ఏ అంశాలు లేవు? మూలంలో ఉపయోగించిన పద్యగతిని నిర్దేశిత పాఠకులు అర్థం చేసుకుంటారా? చేసుకోలేకపోతే విశేషణాలు, సోదాహరణలు, భావనలను ఏమైనా మార్చాలా?
- పాఠకుల్లో ఈ పదాలు ఎలాంటి ప్రతిస్పందనను కలగజేయాలి? ఈ ప్రశ్న, పైన చెప్పిన రెండో ప్రశ్నకు దగ్గరగా ఉంటుంది. మనం ఎలాంటి పదాలు ఎంచుకోవాలి? వాటి పొందిక ఎలా ఉండాలి? అనే అంశాలను నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది.
మూలంలోని కంటెంట్‌ను పరిశీలించడం ద్వారా ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలుసుకోవాలి. ఆ తరువాత మనలోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసి మూలంలో ఉన్న మాయాజాలాన్ని లక్షిత భాషలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అందువల్ల, ఈ పని కేవలం అనువాదం మాత్రమే కాదు. మూల భాషను స్ఫూర్తిగా తీసుకుని చక్కగా సొంతంగా రాసిన దానికి దగ్గరగా ఉండేలా అనువదించాలి. నిర్దేశిత పాఠకులు మాట్లాడే పదాలు, వ్యక్తీకరించే భావాలు, వారు చెప్పుకునే ఉదాహరణలు అనువాదంలో ఉండాలి. అచ్చంగా మూలంలో లాగే!
అనువాదకులు ఈ సూక్ష్మమైన విషయాలను అర్థం చేసుకోకుండా మొద్దుగా వెళితే ట్రాన్స్‌క్రియేషన్ చేసిన కంటెంట్ ఉప్పు కారం లేనట్లు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నవ్వులపాలు కావలిసి వస్తుంది కూడా.
అయితే, ప్రతి రోజూ ఒక పద్యాన్నో ఒక సృజనాత్మక వ్యాసాన్నో లోకలైజ్ చేయాల్సిన అవసరం వ్యాపార సంస్థలకు ఉండదు. ఎక్కువ సందర్భాల్లో కాపీ రైటింగ్, మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో సబ్‌టైటిళ్లు లాంటి వాటిలో ట్రాన్స్‌క్రియేషన్ అవసరం పడుతుంది. సంస్కృతులు, సరిహద్దులు, భాషలు దాటుకుని ఒక బ్రాండ్ వాణిజ్యపరంగా విజయవంతం కావడంలో ట్రాన్స్‌క్రియేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
భావోద్వేగాలు అనేవి భాషలకు అతీతంగా ఉంటాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందువల్ల అనువాదం సృజనాత్మకంగా ఉంటే ట్రాన్స్‌క్రియేట్ చేసిన కంటెంట్ మూలంలోని సంతోషాన్ని, బాధను, స్ఫూర్తిని, ఉద్వేగాన్ని యథాతథంగా తీసుకువస్తుంది.
హిందీలో పీయూష్ మిశ్రా కావొచ్చు. తమిళంలో సుబ్రమణ్య భారతి కావొచ్చు. తెలుగులో వేమన కావొచ్చు. కన్నడంలో కె.ఎస్. నరసింహస్వామి కావచ్చు. లేదా మరొక మహనీయుడు కావొచ్చు. వీరు ఇచ్చిన సందేశం మానవజాతిని జాగృత పరచడానికి భాష అడ్డంకి కాకూడదు. వీరి సృజనాత్మక స్ఫూర్తిని, వీరి పద్యాలు, కావ్యాల్లోని అంతరార్థాన్ని ఆయా భాషలు మాట్లాడని వారికి అందించడానికి మన శక్తిమేర కృషి చేయాలి.
మీ దృష్టికి వచ్చిన అద్భుతమైన లేదా పరమచెత్త ట్రాన్స్‌క్రియేషన్ ఏదైనా ఉందా? ఉంటే మీ అభిప్రాయంతో సహా మాకు పంపండి. మేమూ వింటాం!
December 11, 2018 — magnon