మనం 5000కు పైగా భాషలు మాట్లాడే ప్రపంచంలో నివసిస్తున్నాము, వాటిలో చాలా భాషలకు వాటికి సంబంధించిన లిపితో పాటు వేటికవి పలు మాండలికాలను కూడా కలిగి ఉన్నాయి. భౌగోళిక కారణాల వల్ల సుదూర ప్రాంతాలకు సమాచారమార్పిడి వీలుకాకపోవడంతో, తమ తమ ప్రాంతాలకే పరిమితమైన ఆయా జాతి సమూహాలు తమ తమ భాషల్లోనే మాట్లాడుకుంటూ, రాయడం, చదవడం చేస్తుండేవి. కానీ, ఆకాశయానం మరియు టెలీకమ్యూనికేషన్ల ఆగమనం పుణ్యమా అని ప్రస్తుతం ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది.
2000 నుండి 2018 మధ్య, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు మధ్య ప్రాచ్యం లాంటి ప్రపంచ ప్రాంతీయ మార్కెట్లకు ఇంటర్నెట్ చేరిక రమారమి 1000 శాతం పైగా వృద్ధి చెందింది [1]. లక్షలాదిమంది కొత్త వినియోగదారులు ఈ సంవత్సరాల్లో ఆన్‌లైన్ సౌలభ్యం పొందారని దీని అర్థం. ఈ విధంగా ప్రపంచం అనుసంధానమై ఉండటం ద్వారా, వినియోగదారు మార్కెట్ అన్నది అతిపెద్దదిగా మారి ఎన్నో అవకాశాలను అందజేసింది. ఏదేమైనా, ఈ ప్రాంతీయ మార్కెట్లలో ఆంగ్లేతరమైన స్థానిక భాషలు రాజ్యమేలుతున్నాయి. అందుకే, భాషా వైవిధ్యం అనేది ఒక సవాలుగా పరిణమించింది. ప్రపంచం కుగ్రామంగా మారిపోయిన తరుణంలో అది తీసుకువచ్చిన ఈ రకమైన సవాలును ప్రతీ రోజు బహుళ జాతి సంస్థలు ఎదుర్కొంటున్నాయి.
ఇంకా, వీటిలోని పలు మార్కెట్లలో, ఒకప్పటి బ్రిటీష్ సామ్రాజ్యవాదుల ఏలుబడికి గుర్తుగా, అక్కడి వినియోగదారులకు ఇంగ్లిష్ పరిజ్ఞానం ప్రాథమికంగా ఉంది. ఈ తరహా మార్కెట్లలో వస్తువులు మరియు సేవలకు సంబంధించిన కంటెంటును స్థానిక భాషల్లో అందించడమా లేక ఇంగ్లిషుకే కట్టుబడి ఉండటమా అనే కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు, ఆ నిర్ణయం, ఆయా సంస్థల ఆదాయం, బ్రాండ్ పేరు మరియు వృద్ధిని ప్రభావితం చేస్తుంది. అలాగని, కంటెంటును స్థానికీకరించే పనిని చేపట్టకుండా ఇంగ్లిషుకే కట్టుబడటం అనేది కూడా అంత ఇబ్బందికరమైన ఆలోచన కాదు, ఎందుకంటే దీని వల్ల సదరు సంస్థకు కంటెంటుపై నియంత్రణకు – అర్థం, స్వరం, శైలి వంటి విషయాల్లో- అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ, కంటెంట్ స్థానికీకరణ (లోకలైజేషన్) గురించి మిమ్మల్ని ఒప్పించడం గురించి కాదు కానీ, దాని వల్ల కలిగే ప్రయోజనాలను, ఎత్తుపల్లాలను తెలివిగా అధిగమిస్తూ మరింత లాభం ఆర్జించడం లాంటి ఎన్నో ప్రయోజనకరమైన కారణాలను వివరించడమే ఈ వ్యాసం లక్ష్యం.
వినియోగదారులు తమ స్థానిక భాషకు ప్రాధాన్యమిస్తారా?
స్థానిక భాషలో గల ప్రోడక్ట్ డిస్క్‌రిప్షన్ (ఉత్పాదన వివరణ) మరియు ఆన్‌లైన్ యూఐ (యూజర్ ఇంటర్‌ఫేజ్) వినియోగదారు యొక్క కొనుగోలు నిర్ణయాన్ని చెప్పుకోదగిన రీతిలో ప్రభావం చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది [2]. అయితే, అధిక ధర గల ప్రోడక్టులను కొనుగోలు చేసేటప్పుడు స్థానిక భాషల్లోని యూఐ, డిస్క్రిప్షన్ ప్రభావం మరింత అధికంగా ఉంటాయని అదే నివేదిక తేటతెల్లం చేసింది. దాని అర్థం, అధిక ధర గల ప్రోడక్టులను కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు, వినియోగదారులు, వారి వారి భాషల్లో ఆ ప్రోడక్టు వివరాల గురించి కూలంకషంగా తెలుసుకున్న తర్వాతే కొంటున్నారు అన్నమాట. కొందరు ఇటలీ విద్యార్థులతో జరిపిన అధ్యయనంలో [3] భాగంగా – వారికి వేరువేరుగా ఇటాలియన్, ఇంగ్లీష్ భాషల్లో ప్రోడక్ట్ వివరాలు రాసి ఉన్న ఉత్పత్తులను చూపారు. వాటిలో ఒకదాన్ని ఎంచుకోమని సూచించగా, ఇటలీ భాషలో రాసిన ప్రోడక్టును ఎంచుకున్నారు. సదరు విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం బాగానే ఉన్నప్పటికీ వారు తమ స్వంత భాష గల ప్రోడక్టునే ఎంచుకోవడం ఇక్కడ గమనార్హం. వినియోగదారు ప్రవర్తన విషయాన్ని తెలుసుకునేందుకు, వారిని వివిధ వ్యక్తిత్వాలు గల వర్గాలుగా విభజించడంలో స్థానిక భాష ఉపయోగపడుతుందని కూడా తెలిసింది. గాలప్ సంస్థ జరిపిన సర్వేలో [4], 56 శాతం మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఏవైనా వస్తువులను కొనుగోలు చేసేందుకు, స్థానిక భాషల్లో గల వెబ్‌సైట్లను వెతుకుతున్నామని వెల్లడించారు. కాబట్టి, సగానికి పైగా లక్షిత వినియోగదారులు (టార్గెట్ కస్టమర్స్) తమ తమ స్థానిక భాషలకు ప్రాధాన్యతనిస్తున్నారని మనకు దీని వల్ల అవగతమవుతుంది.
మలేసియాలో వినియోగదారులపై మరింత నేరుగా జరిపిన మరో అధ్యయనంలో [5], స్థానిక భాషలో నిర్వహించిన ఆరోగ్య బీమా ఉత్పాదనల ప్రకటనలు, వారి కొనుగోలు ప్రవృత్తిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపినట్లు తేలింది.
స్థానిక భాష ఇంకేమి చేయగలదు?
బ్రాండ్ పేరుపై, దాని ఉత్పత్తులపై వినియోగదారులకు ప్రత్యక్షంగా నమ్మకం కలిగించే విషయంలో ఆయా స్థానిక భాషల్లో రూపొందించిన ప్రకటనలు మరింత ప్రభావవంతంగా ఉండి, స్వంత-బృందంతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నామనే భావనను వినియోగదారులలో కలిగిస్తాయి. బ్రాండ్ ఇమేజీని పెంచుకోవడం, దానిని కొనసాగించడంలో ఈ నమ్మకం చక్కని పాత్రను పోషిస్తుంది.
స్థానిక భాషకు ప్రాధాన్యతనివ్వడం గురించి పైన పేర్కొన్న వివరాలన్నీ కలిపి చూస్తే, భాషా ప్రాధాన్యతలనేవి వినియోగదారు ప్రవర్తనను ప్రభావితం చేయడంతో కీలకపాత్ర పోషిస్తాయని, అంతే కాకుండా సంస్థల ఆదాయంపై కూడా దాని ఫలితం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. నిజమైన ప్రపంచ సంస్థలుగా ఆవిర్భవించాలని కలలు గనే బహుళ జాతి సంస్థలు ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని విశ్వ వినియోగదారుల వ్యవస్థ యొక్క ప్రాధాన్యతలకు విలువనిచ్చి, వాటికి అనుగుణంగా తమను తీర్చిదిద్దుకునేందుకు ఇదొక అవకాశం. చాలా ఎం.ఎన్.సి.లు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తమ కంటెంటును స్థానికీకరించడం కోసం బయటి సంస్థలను నియోగించుకుంటున్నాయి. దాని కారణంగానే, ఇటీవలీ ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ అనుకూల ఎదుగుదల నమోదుచేసిన అతి కొద్ది పరిశ్రమల్లో ఒకటిగా లోకలైజేషన్ పరిశ్రమను గురించి ఆర్థిక వర్గాలు పేర్కొనడం జరిగింది.
మీ తోటి వారు ఇప్పటికే తమ కంటెంటును లోకలైజ్ చేయడం మొదలుపెట్టి గొప్ప ప్రయోజనాలు పొందుతుండగా, మీరు కూడా ఎందుకు అలా చేయకూడదు?
అదనపు మూలాధారాలు
[1] https://www.internetworldstats.com/stats.htm
[2] Can’t Read, Won’t Buy: Why Language Matters on Global Websites By Donald A. DePalma, Benjamin B. Sargent, and Renato S. Beninatto September 2006
[3] Cross-Cultural Consumer Behavior: Use of Local Language for Market Communication—A Study in Region Friuli Venezia Giulia (Italy) by Franco Rosa, Sandro Sillani & Michela Vasciaveo
Pages 621-648 | Journal of Food Products Marketing Volume 23, 2017 – Issue 6
[4] User language preferences online; Survey conducted by The Gallup Organization, Hungary upon the request of Directorate-General Information Society and Media
[5] The Influence of Language of Advertising on Customer Patronage Intention: Testing Moderation Effects of Race Muhammad Sabbir Rahman, Fadi Abdel Muniem Abdel Fattah, 1 2
Nuraihan Mat Daud and Osman Mohamad ; Middle-East Journal of Scientific Research 20 (Language for Communication and Learning): 67-74, 2014
August 20, 2018 — magnon