మాతృభాష కాకుండా మరో భాషను నేర్చుకోవడం అంటే రెండో ఆత్మను పొందినట్లేనని 8వ శతాబ్దానికి చెందిన రోమన్ చక్రవర్తి ఛార్లెస్ ది గ్రేట్ అంటారు. (ఈయన్నే ఛార్ల్‌మాగ్నే అని కూడా అంటారు.) ఇదే రకమైన అభిప్రాయం 21వ శతాబ్దంలో కూడా వ్యక్తమవుతోంది. ప్రముఖ ఇంగ్లీషు రచయి జాఫ్రీ విలన్స్ ఓ సందర్భంలో, మీరు రెండో భాషను నేర్చుకోకపోతే మొదటి భాషను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని చెప్పారు. ఛార్లెస్, విలన్స్ భావయుక్తంగా చెప్పిన ఈ మాటలపై మీకు సందేహాలు ఉండొచ్చు. కానీ మరో భాషను నేర్చుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కొత్త భాష మానవ మెదడుని చురుగ్గా ఉంచుతుంది. ఉద్యోగ అవకాశాల్ని పెంచుతుంది. రోజువారీ జీవితంలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
నాడీ కణజాలంపై ప్రభావం
కొత్త భాషను నేర్చుకోవడం వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది[1] అనే అంశంపై డా.వియోరికా మారియన్, ఆంథోనీ షుక్ అనే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. కొత్త భాష.. మానవ మెదడును చురుగ్గా ఉంచడమే కాకుండా ఏకకాలంలో వివిధ రకాల పనులు చేయడానికి అవకాశం ఇస్తుందని వీరి అధ్యయనంలో తేలింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. మనం వేరే భాషలో మాట్లాడుతున్నప్పటికీ చాలా వరకు మాతృభాషలో ఆలోచిస్తుంటాం. దీనివల్ల ఒక భాషను మాట్లాడుతూనే మరో భాషకు అలవాటు పడతాం. ఇది చాలా సులభంగా జరిగిపోతుంది. ఫలితంగా ఒకే సమయంలో రెండు మూడు పనులు చేయడానికి అనువుగా మనం మెదడు అలవాడు పడుతుంది. పసికందుల్లో కూడా మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. 7 నెలల బిడ్డ కూడా మల్టీ టాస్కింగ్ చేయగలడని పరిశోధనల్లో నిరూపితమైంది. రెండు భాషలు మాట్లాడే వాతావరణంలో పసిబిడ్డ పెరిగితే చుట్టూ ఉన్న పరిస్థితులకు త్వరగా అలవాటు పడతాడని కూడా తేలింది. అంటే కుటుంబ సభ్యులు, ఇతర సంరక్షకులు ఒక భాష కంటే ఎక్కువ భాషలు మాట్లాడటం వల్ల పసికందుల మెదడులో చురుకుదనం పెరుగుతుంది. అయితే కొత్త భాషను కేవలం చిన్న వయసులోనే నేర్చుకోగలరు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. మరో భాషను నేర్చుకోవడానికి వయసు ఎప్పుడూ కూడా అడ్డంకి కాదు. వృద్ధాప్యంలోకి వచ్చిన వారు కొత్త భాషను నేర్చుకోవడం ద్వారా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. వారికి మతిమరుపు లాంటి వచ్చే అవకాశం తగ్గుతుందని మారియన్, ఆంథోనీల పరిశోధన చెబుతోంది. ఒక భాష మాట్లాడే వృద్ధుల కంటే రెండు అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడే వారు చలాకీగా ఉంటారని వివరిస్తోంది.
సామాజిక జీవితం
మనం ఒకటి అంతకంటే ఎక్కువ కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల భాషల మధ్య మెరుగ్గా అనువాదం చేయగలం. మన కమ్యూనికేషన్స్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. తర్కబద్ధంగా ఆలోచించే శక్తి మెరుగవుతుంది. ఫలితంగా మనం ఇతరుల్ని బాగా అర్థం చేసుకోగలం. మనకు మనమే కొత్తగా కనిపిస్తాం. మన ఆలోచనల్ని, భావాల్ని మెరుగ్గా ఇతరులకు చెప్పగలుగుతాం. దీంతో పాటు ప్రతి భాషలో ఉంటే కొన్ని నిర్దిష్టమైన పదాల్ని తెలుసుకోగలుగుతాం. కొన్ని పదాలు ఆ భాషకు మాత్రమే పరిమితమై ఉంటాయి. వాటి సమానార్థకాలు మన భాషలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి భాషలో కూడా ఆ ప్రాంతంలోని సంస్కృతిలో నుంచి, అక్కడి ప్రజల దైనందిన జీవితాల్లో నుంచి ప్రత్యేకంగా పుట్టే పదాలు ఉంటాయి. ఇలాంటి పదాలను మన భాషలోని సమానార్థకాలతో స్పష్టంగా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అదే కొత్త భాషను నేర్చుకుంటే ఆ భాష మాట్లాడే ప్రాంతంలోని సంస్కృతి గురించి, కళల గురించి లోతుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నింటి ఫలితంగా తోటి మానవుల పట్ల మన సహానుభూతి పెరుగుతుంది. వారి శరీరాకృతులను, ఆహారపు అలవాట్లను, వేషధారణలను అర్థం చేసుకోగలుగుతాం. మొత్తంగా మనుషుల మధ్య విభజించే అంశాల కన్నా కలిపే ఉంచే అంశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయం కొత్త భాష(లు) నేర్చుకోవడం ద్వారా అర్థమవుతుంది.
ఉద్యోగ అవకాశాలు
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషల్ని నేర్చుకోవడం వల్ల మీ రెస్యూమ్ బలం పెరుగుతుంది. ఒకటి కంటే ఎక్కవ భాషలు మాట్లాడే వారిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి పరిగణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంపెనీలకు మీ ప్రొఫైల్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త భాషను నేర్చుకోవడానికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వాటికి ఉండదు. తద్వారా ఖర్చును తగ్గించుకోగలుగుతాయి. ఈ సానుకూలత కేవలం గ్లోబల్ లోకలైజేషన్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదు. ఇతర రంగాల్లో కూడా బహుళ భాషలు వచ్చిన వారికి అడ్వాంటేజీ ఉంటుంది.
(గ్లోబల్ లోకలైజేషన్ ఇండస్ట్రీ అనేది ఒక అనువాద పరిశ్రమ. అయితే ఇందులో అనువాదం పాటు మరెన్నో అంశాలు ఉంటాయి. కేవలం మూల భాషలో ఉన్న దాన్ని లక్ష్య భాషలోకి తీసుకురావడం మాత్రమే కాకుండా స్థానిక సంస్కృతులు, అవసరాలకు అనుగుణంగా మూల భాషలోని కంటెంట్‌ను అనువదించడం ఈ పరిశ్రమ ప్రధాన ఉద్దేశం. టెక్నాలజీ కంపెనీల వల్ల ఈ ఇండస్ట్రీ బాగా వృద్ధి చెందుతోంది.)
ఉదాహరణ 1
హోటల్ / టూరిజం : పర్యాటక, హోటల్ రంగాలంటే నిత్యం కస్టమర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. కస్టమర్లకు స్థానిక భాష తెలిసి ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ స్థానిక భాష తెలిసినప్పటికీ మాతృభాషలో మాట్లాడానికి ఇష్టపడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో స్థానిక భాషతో పాటు కస్టమర్ల మాతృభాషను మాట్లాడగలిగే సామర్థ్యం ఉంటే వారితో సంభాషించడం సులవవుతుంది. కస్టమర్లు తమ సొంతూర్లో ఉన్నట్లుగానే భావిస్తారు. తమకు సర్వీసు అందించే వారి పట్ల నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా హోటల్, టూరిజం కంపెనీలకు లాభాలు పెరుగుతాయి.
ఉదాహరణ 2
జర్నలిజం : వేరే దేశం నుంచి రిపోర్టింగ్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా బహుళ భాషలు మాట్లాడే ఇండియా లాంటి దేశంలోని వేరే రాష్ట్రం నుంచి వార్తలు సేకరించాల్సి వచ్చినప్పుడు మీరు రిపోర్ట్ చేసే భాషకు అదనంగా స్థానిక భాష తెలిసి ఉంటే అది చాలా మేలు చేస్తుంది. వేరే రాష్ట్రంలో వార్తలు సేకరిస్తున్నప్పుడు అక్కడి వాళ్లతో వాళ్ల భాషలో మాట్లాడినప్పుడు ఆ వార్తలు ఎంత బాగుంటాయో జర్నలిజంలో ఉన్న వారందరికీ తెలుసు. స్థానిక భాషలో కాకుండా మాతృభాష ద్వారానే వార్తలు సమీకరించాల్సి వచ్చినప్పుడు రిపోర్టర్లు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
కొత్త భాషను నేర్చుకోవడానికి మేము చెప్పిన కారణాలతో మీరు ఏకీభవిస్తారా? మీ దగ్గర ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? దయచేసి కామెంట్లలో మీ అభిప్రాయాలను చెప్పండి. మీరు చెప్పేది వినాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం!
రెఫరెన్స్ :
[1] Marian, V., & Shook, A. (2012). The cognitive benefits of being bilingual. Cerebrum : the Dana forum on brain science, 2012, 13.
December 24, 2018 — magnon