భార‌తీయ భాష‌లు – కంప్యూట‌ర్ టైపింగ్ – సంక్షిప్త పరిచ‌యం

మాతృ భాష‌లో టైపింగ్ చేసుకుంటే క‌లిగే ఆనంద‌మే వేరు. దాన్ని లెక్క‌గ‌ట్టేందుకు కొల‌మానం ఉండ‌దు. ఒక‌ప్పుడు మ‌న భాష‌లో టైప్ చేయ‌డం చాలా క‌ష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా టూల్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకోవ‌డ‌మే ఈ వ్యాసం ఉద్దేశం.

Written by: G Chandra Sekhar

ఒక‌ప్పుడు కంప్యూట‌ర్‌లో భార‌తీయ భాష‌ల్ని టైప్ చేయ‌డం చాలా క‌ష్టంగా ఉండేది. దాదాపు అన్ని ఇండిక్ లాంగ్వేజెస్‌లో వ‌త్తులు, కొమ్ములు లాంటివి ఉంటాయి. ఇంగ్లీషు భాష‌కు ఇలాంటి స‌మ‌స్య లేదు. అవ‌న్నీ విడి అక్ష‌రాలు. 20-25 ఏళ్ల కింద‌ట భార‌తీయ మీడియా సంస్థ‌లు త‌మ సొంత టైపింగ్ టూల్స్‌ను, ఫాంట్ల‌ను డెవ‌ల‌ప్ చేసుకున్నాయి. ఇలాంటి వాటిలో తెలుగుకు సంబంధించినంత వ‌ర‌కు యాపిల్ కీ-బోర్డు ఒక‌టి. దీనిని ప్రధానంగా ఈనాడులో ప‌ని చేసిన వారు వాడుతుంటారు. అలాగే త‌మిళంలో త‌మిళ్99 కీ-బోర్డు పాపుల‌ర్ అయింది. ఉత్త‌ర భార‌త భాష‌లు ఎక్కువ‌గా ఇన్‌స్క్రిప్ట్ కీ-బోర్డును వాడుతున్నాయి. ఈ ఇన్‌స్క్రిప్ట్ అన్ని భాష‌ల్లోనూ అందుబాటులో ఉంది. దీని లేఅవుట్‌ను భార‌త ప్ర‌భుత్వం 1986లో ఖ‌రారు చేసింది. యాపిల్ అయినా, ఇన్‌స్క్రిప్ట్ అయినా ప్ర‌త్యేకంగా టైపింగ్ చేయ‌డం నేర్చుకోవాలి. ఇందుకోసం ఒక‌టి రెండు వారాల స‌మ‌యం ప‌డుతుంది. ఇలా కాకుండా ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే తెలుగులో వ‌చ్చే విధానాన్ని ఫోనెటిక్ టైపింగ్ అంటారు. ప‌లు టైపింగ్ వెబ్‌సైట్ల‌లో ఈ స‌దుపాయం ఉంది.

indiatyping.com, lekhini.orgల‌తో పాటు ప‌లు సైట్లు టైపింగ్ సేవ‌లందిస్తున్నాయి. ఇందులో indiatyping.com అన్ని భాష‌ల్లో ఉండ‌గా లేఖిని తెలుగుకు ప‌రిమితం. ఇవి కాకుండా గూగుల్ ఇన్‌పుట్ టూల్స్, మైక్రోసాఫ్ట్ ఇన్‌పుట్ టూల్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్స్‌లో గూగుల్ ఇన్‌పుట్ టూల్స్ అందుబాటులో ఉంది. ఇవ‌న్నీ ఫోనెటిక్ లేదా ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డుల‌కు మాత్ర‌మే స‌పోర్ట్ చేస్తాయి. ఫోనెటిక్ కీబోర్డులో టైప్ చేస్తున్న‌ప్పుడు, కింది ఫోటోలో చూపిస్తున్న విధంగా స‌జెష‌న్స్‌ వ‌స్తాయి. జ్ఞాప‌కం అనే ప‌దం టైప్ చేసిన‌ప్పుడు మీరు త‌ప్పుగా టైప్ చేస్తే కింద స‌రైన ఐదు ర‌కాల ఆప్ష‌న్స్ వ‌స్తాయి. వాటిలో నుంచి మీరు క‌రెక్ట్‌గా ఉన్న దానిని ఎంచుకోవ‌చ్చు. ఐదింటిలో ఇంగ్లీషు ప‌దం కూడా ఉంటుంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి దాన్ని కూడా ఎంచుకోవ‌చ్చు.

ఫోనెటిక్ కీబోర్డు చాలా సుల‌భం. ఇంగ్లీషు అక్ష‌రాల‌ను టైప్ చేస్తుంటే తెలుగు అక్ష‌రాలు వ‌స్తాయి. ఇందులో న కారం వ‌చ్చిన‌ప్పుడు స‌మ‌స్య వ‌స్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు సైట్‌కు అని రాయాల్సి వ‌చ్చిన‌ప్పుడు సైట్కు అని ప‌డుతుంది. అప్పుడు సైట్‌కు అని రావాలంటే సైట్ అని టైప్ చేసిన త‌రువాత ctrl + shift + 2 అని కొట్టి ను అక్ష‌రాన్ని టైప్ చేయాలి. ఇన్‌స్క్రిప్ట్‌, ఫోనెటిక్ కాకుండా తెలుగులో యాపిల్ కీబోర్డు కూడా పాపుల‌ర్ అయింది. ఈ యాపిల్ కీబోర్టు కేవ‌లం ఒక్క higopi.comలో మాత్ర‌మే ఉంది. ఈ మ‌ధ్య కాలంలో ఈ వెబ్‌సైట్ సృష్టిక‌ర్త కాలం చేశారు. ఫ‌లితంగా ఈ సైట్ ప్ర‌స్తుతం ఓపెన్ కావ‌డం లేదు. జులై 30 నుండి సైట్ ఓపెన్ కాక‌పోవ‌డంతో ఇందులో టైప్ చేసుకుంటున్న వారంతా ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం higopi.com వెబ్‌సైట్, http://www.vakkalanka.in/ucedit/Telugu.html లో అందుబాటులో ఉంది. మీకు కావాల్సిన కీబోర్డును ఎంపిక చేసుకుని save settings పైన క్లిక్ చేయండి. మీ సిస్ట‌మ్ లాంగ్వేజ్‌.. ఇంగ్లీషులో ఉండేలా చూసుకోండి. గూగుల్ ఇన్‌పుట్ టూల్స్ కార‌ణంగా కానీ, మ‌రే కార‌ణం చేత గానీ సిస్ట‌మ్ లాంగ్వేజ్ తెలుగులో ఉంటే మీరు ఎంచుకున్న కీబోర్డు ప‌ని చేయ‌దు. 

 

http://www.vakkalanka.in/ucedit/ లో ఒక్క తెలుగే కాకుండా మ‌రి కొన్ని భార‌తీయ భాష‌ల‌ను కూడా టైప్ చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే క్యారెక్ట‌ర్ లిమిట్ ఉన్న వారికి ఇందులో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు స‌మ‌స్య‌లు అనే ప‌దాన్నే తీసుకుందాం. ఇందులో వాస్తవంగా ఉన్న క్యారెక్ట‌ర్స్ 7. కానీ అద‌నంగా నాన్‌-జాయిన‌ర్స్ రావ‌డం వ‌ల్ల క్యారెక్ట‌ర్ల సంఖ్య ప‌దికి చేరుతుంది. ఈ నాన్‌-జాయిన‌ర్స్ వ‌ల్ల‌ రీడ‌ర్‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌దు. వీటిని హిడెన్ క్యారెక్ట‌ర్స్ అంటారు. వీటిని క‌నిపెట్ట‌డానికి ప్ర‌త్యేకమైన టూల్స్ కావాలి. సాధార‌ణంగా టెక్నాల‌జీ కంపెనీల‌కు ట్రాన్స్‌లేట్ చేసే వారికి హిడ‌న్ క్యారెక్ట‌ర్ల  వ‌ల్ల.. క్యారెక్ట‌ర్ లిమిట్ దాటిపోతుంటుంది. అలాంటి వారు.. స‌ద‌రు కంపెనీలు అందించే టూల్స్‌లో హిడ‌న్ క్యారెక్ట‌ర్ష్ విజిబిలిటీని ఆన్ చేసి అవ‌స‌రానికి మించి ఉన్న‌ నాన్‌-జాయినర్స్‌ను తొల‌గించుకోవాలి. 

 

ఇవే కాకుండా C-DAC అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ కూడా భార‌తీయ భాష‌ల కోసం ఒక సాఫ్ట్‌వేర్‌ను డెవ‌ల‌ప్ చేసింది. ఆయా భాషల్లో ప్ర‌ముఖంగా ఉండే కీబోర్డుల‌న్నింటిని ఇందులో ఇన్‌క్లూడ్ చేసింది. తెలుగుకు సంబంధించి ఫోనెటిక్‌, ఇన్‌స్క్రిప్ట్‌, యాపిల్ కీ-బోర్డులు సీ-డాక్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నాయి. www.cdac.in/index.aspx?id=ev_corp_gist_ism_launch అనే లింకులో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 32 బిట్‌, 64 బిట్‌ల‌లో ఇది అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చే కంప్యూట‌ర్‌లు చాలా వ‌ర‌కు 64 బిట్‌లోనే ఉంటున్నాయి. ఇందులో అద‌నంగా హిడెన్ క్యారెక‌ర్లు రావ‌డమ‌న్న స‌మ‌స్య లేదు. హాయ్ గోపిలో టెక్ట్స్‌ను కాపీ చేసి వేరో చోట పేస్ట్ చేసిన‌ప్పుడు ఒత్తులు విరిగిపోవ‌డం లాంటి స‌మ‌స్య ఉంది. సీ-డాక్ డెవ‌ల‌ప్ చేసిన‌ Intelligent Script Manager (ISM)లో ఇలాంటి ఇబ్బంది రాదు. ఆన్‌లైన్ టైప్ చేయాల‌నుకున్న‌ప్పుడు మీ వీలును బ‌ట్టి సైట్‌ను గానీ, ఎక్స్‌టెన్స‌న్ గానీ వాడొచ్చు. ఇంట్లో లేదా ఆఫీసులో ప్ర‌త్యేకించి రెగ్యుల‌ర్‌గా ఒకే సిస్ట‌మ్‌లో టైప్ చేస్తున్న‌ప్పుడు ISMను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం మేలు. డౌన్‌లోడ్ చేసుకునే ఏ సాఫ్ట్‌వేర్‌లో అయినా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీషులో మార‌డానికి షార్ట్ క‌ట్‌లు ఉంటాయి. ISMలో క్యాప్స్ లాక్ గానీ, స్క్రోల్ లాక్ గానీ, నెంబర్ లాక్ గానీ వాడుకోవ‌చ్చు. 

 

——————————————————————————————————————————-

Disclaimer : The opinions expressed here belong solely to the author(s) and are not to be taken as the stated position(s) of Magnon or its subsidiaries.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *